కాఫీవిత్…ఆర్ రమాదేవి.2848- ఎ. రజాహుస్సేన్

అయినా..నిన్ను పిలవాలంటే సాకులు ఏమై
నా చెప్పాలా! కథలేమైనా అల్లాలా..?
*ఓయ్.! నిజం చెప్పు యుగాలనాటి కలత నిదురలోని  కల నువ్వే కదూ....”!!

R రమాదేవి గారి టిపికల్ కవిత ఇది..వస్తువు..
అతడు… ఆమె…ప్రేమ... దూరం…భారమే…
అయినా వ్యక్తీకరణకు కొత్తదనం అద్దారు….!
ఈరోజు కాఫీటైమ్లో రమాదేవి కవితను చూద్దాం.
మీరూ ఓ సారి ఈ కవిత పూర్తి పాఠం చదవండి.!!

“వానకురవని రాత్రి
రెండు కాగితపు పడవలు చేశాను
ఎంత వెతికినా
రెండో పడవ దొరకలేదు
వెతుకుదాం ... కాస్త రావోయి
అయ్యో
నవ్వులాటేమీ కాదు
ఆకతాయితనము అసలే కాదు
అయినా
నిన్ను పిలవాలంటే
సాకులు ఏమైనా చెప్పాలా
కథలేమైనా అల్లాలా
రా... వచ్చి ఇటువైపు కూర్చో
కాఫీ, నాలుగు కబుర్లు చెప్పుకుందాం
తీరుబడిగా చేయి చేయి పట్టుకొని
సముద్రతీరం వెంబడి వెతుకుదాం
ఓహ్
నీ స్పర్శ వేల ఆకాశాలను
పట్టుకంబలిగా చేసిందేమో
తేనె చుక్కల నిదురేదో
మగతగా చెంత చేరుతుందిరా
ఓయ్
నిజం చెప్పు
యుగాలనాటి కలత నిదురలోని
కల నువ్వే కదూ....”!!
*ఆర్. రమాదేవి..!!

ఓ వానకురవని రాత్రి రెండు కాగితపు పడవల్నిచేసిందామె…
అందులో ఒకపడవ మిస్ అయింది. ఎంత వెతికినా ఆ పడవ దొరకలేదు.
వెతుకుదాం ... కాస్త రావోయి.. అంటూ అతగాడిని పిలుస్తోందామె.

అతగాడు తన మాటల్ని నవ్వులాటగా భావిస్తాడా?
వాన కురవని రాత్రి కాగితపు పడవలు తయారు చేయడమేంటి?
అందులో ఒకటి కనబడకుండా….పోవడమేంటి?
అంతా మాయగా వుందని అతగాడు భావిస్తాడేమోనని లోలోపల శంక ఆమెది..
అందుకే ముందు శంకను దూరం చేయాలనుకుంది.

అయ్యో….
నవ్వులాటేమీ కాదుబాబూ..ఆకతాయితనము అసలే కాదు..
నిజం.. మదర్ ప్రామిస్.. నన్ను.. నమ్ము…
అయినా…
నిన్ను పిలవాలంటే సాకులు ఏమైనా చెప్పాలా? కథలేమైనా అల్లాలా?
అంతరంగం తెలిసినోడికి కొత్తగా చెప్పాలా?
సర్లే…రా... వచ్చి ఇటువైపు కూర్చో.. అందామె..

కప్పు కాఫీ, నాలుగు కబుర్లు చెప్పుకుందాం.!
తీరుబడిగా చేయి చేయి పట్టుకొని సముద్రతీరం వెంబడి వెతుకుదాం..
తప్పిపోయిన…తమ ప్రేమ పడవ దొరుకుతుందేమనని….

ఓహ్..!
అతగడి స్పర్శ వేల ఆకాశాలనుపట్టుకంబలిగా చేసిందేమో….
తేనె చుక్కల నిదురేదో మగతగా ఆమె చెంతకు చేరుతోంది…

ఓయ్..!అంటూ పిలిచిందామె..
నిజం చెప్పు….
యుగాలనాటి కలత నిదురలోని కల
నువ్వే కదూ...అంటూ నిలదీసింది….

అంతే అతగాడు కలగా కరిగిపోయాడు..
అన్నట్టు…తప్పిపోయిన ఆ రెండో పడవ
అతగాడు కాదు కదా..!

దీనికి సమాధానం
పాఠకుల ఊహకే వదిలేసింది.. రమాదేవి..!!

*ఎ. రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!